manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 1:50 am Editor : Editor Vishal Kumar

పంటల బీమాపై విమర్శలకు గణాంకాలే సమాధానం!

పంటల బీమాపై విమర్శలకు గణాంకాలే సమాధానం!

ఖరీఫ్‌–2026లో రెట్టింపునకు పైగా పెరిగిన బీమా నమోదులు.. 17.07 లక్షల హెక్టార్లకు రక్షణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పెండింగ్ ప్రీమియం బకాయిల చెల్లింపునకు రూ.3 వేల కోట్ల కార్యాచరణ

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, నవంబర్ 26, మన భారత్:

రాష్ట్రంలో పంటల బీమా అమలు, రైతులకు అందిస్తున్న ఆర్థిక సహాయంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు గణాంకాలే సమాధానమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం, ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన వారిని ఆదుకోవడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గత ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఖరీఫ్‌–2026లో పంటల బీమా నమోదులు రెట్టింపునకు పైగా పెరగడం ప్రభుత్వ చర్యలకు నిదర్శనమని వివరించారు.

ఖరీఫ్‌–2026లో రాష్ట్రవ్యాప్తంగా 31.01 లక్షల హెక్టార్లలో సాగు జరగగా, అందులో 17.07 లక్షల హెక్టార్లకు పంటల బీమా రక్షణ కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో 55.05 శాతం బీమా పరిధిలోకి వచ్చిందని తెలిపారు. సుమారు 42 లక్షల ఎకరాలకు బీమా రక్షణ కల్పించామని, బీమా చేసిన విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆరో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

ఖరీఫ్‌–2025లో 18.88 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఖరీఫ్‌–2026లో 44.09 లక్షలకు పెరిగాయని వివరించారు. రుణం పొందని రైతుల బీమా నమోదులు గతంలో 2 లక్షలు ఉండగా, ప్రస్తుతం 25.27 లక్షలకు చేరాయని తెలిపారు. బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య 7.43 లక్షల నుంచి 17.10 లక్షలకు పెరిగిందన్నారు. రైతుల్లో బీమాపై అవగాహన పెంచడం, నమోదు గడువు పొడిగించడం, రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షణ, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు ఈ పురోగతికి దోహదపడ్డాయని చెప్పారు.

రూ.3 వేల కోట్లతో పెండింగ్ బకాయిల పరిష్కారం

గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన పంటల బీమా ప్రీమియం బకాయిలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. 2026–27లో రూ.500 కోట్లు, 2027–28లో రూ.1,000 కోట్లు, 2028–29లో రూ.1,500 కోట్లు చొప్పున మొత్తం రూ.3,000 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్ర వాటా చెల్లింపులకు అనుగుణంగా పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రబీ 2022–23 సీజన్‌కు సంబంధించిన పెండింగ్ ప్రీమియం కోసం రూ.500 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.250 కోట్లు ఇప్పటికే బీమా కంపెనీలకు చెల్లించినట్లు వివరించారు. మిగిలిన బిల్లుల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. ఖరీఫ్‌–2026 నుంచి ప్రత్యేక ఎస్క్రో ఖాతా విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకోసం అదనంగా రూ.250 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో నుంచి ఖరీఫ్‌–2026కు రూ.83 కోట్లు, రబీ 2026–27కు రూ.44 కోట్లు అడ్వాన్స్ ప్రీమియంగా చెల్లించినట్లు వెల్లడించారు.

పంట నష్టపోయిన రైతులకు రూ.310.30 కోట్ల సాయం

ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి తెలిపారు. 2024లో వరదలు, భారీ వర్షాలు, 2025 మార్చిలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన 2.07 లక్షల మంది రైతులకు రూ.310.30 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించినట్లు వివరించారు. వరి, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు హెక్టారుకు అందించే సహాయాన్ని రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు చెప్పారు. ఎంపిక చేసిన ఇతర పంటలకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

పంటల బీమా పరిహారం పొందేందుకు బీమా నమోదు తప్పనిసరి అయినప్పటికీ, ఇన్‌పుట్ సబ్సిడీకి బీమా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట నష్టం నమోదైన అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రెండు హెక్టార్ల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు.

ఖరీఫ్‌–2026లో భారీగా పంట నష్టం

ఖరీఫ్‌–2026లో కరువు, తుఫాన్లు, వరదలు, భారీ వర్షాల కారణంగా వ్యవసాయ పంటలకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. నాలుగు విపత్తులకు సంబంధించి 14,59,225 మంది రైతులకు చెందిన 12,06,269.84 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని తెలిపారు. పెంచిన రాష్ట్ర సహాయ రేట్ల ప్రకారం సుమారు రూ.2,532.89 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అవసరమని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.

కరువు కారణంగా 20 జిల్లాల్లో 9,87,231 మంది రైతులకు చెందిన 9,30,899.69 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని, ఇందుకు రూ.1,863.23 కోట్లు అవసరమని వివరించారు. అర్ణబ్ తుఫాను కారణంగా 13 జిల్లాల్లో 3,82,866 మంది రైతులకు చెందిన 2,24,167.09 హెక్టార్లలో నష్టం సంభవించిందని, రూ.559.77 కోట్ల సహాయం అవసరమని తెలిపారు. మురాసు తుఫాను, సెప్టెంబర్ వరదలు, భారీ వర్షాల వల్ల కూడా వేలాది మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. బాధిత రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.

రబీ పంటల బీమాకు డిసెంబర్‌లోగా నమోదు

రైతులు రబీ 2026–27 సీజన్‌లో తమ పంటలకు బీమా రక్షణ కల్పించుకోవాలని మంత్రి సూచించారు. వరి, మామిడి పంటలకు డిసెంబర్ 31లోగా, ఇతర నోటిఫై చేసిన పంటలకు డిసెంబర్ 15లోగా నమోదు చేసుకోవాలని కోరారు. సమీప బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), మీ సేవ కేంద్రాల ద్వారా బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

బీమాకు సంబంధించిన సందేహాల కోసం రైతులు కిసాన్ కాల్ సెంటర్ 1800-180-1551 లేదా హెల్ప్‌లైన్ 155251ను సంప్రదించాలని సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పంటల బీమా విస్తరణ, పెండింగ్ ప్రీమియం బకాయిల చెల్లింపు, ప్రకృతి విపత్తుల పరిహారం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. రైతుల ప్రయోజనాలను రాజకీయ విమర్శలకు పరిమితం చేయకుండా, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});