manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 3:40 pm Editor : user5442714

బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి..

బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పిల్లలను చదివించి ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహించాలి.

బాల్య వివాహాల సమాచారం వెంటనే అందించాలి: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్.

మన భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు ప్రతి చిన్నారికి విద్య అందించి, ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.

జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పూజారులు, పాస్టర్లు, ఖాజీలకు బాల్య వివాహాల నివారణపై ‘బాల్య వివాహం.. బతుకు ఆగం’ అనే అంశంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నివారణకు ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దే కార్యక్రమంలో మత పెద్దలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి కుటుంబంపై మత పెద్దల ప్రభావం ఉంటుందని, వారి ద్వారా బాల్య వివాహాలు, లైంగిక వేధింపుల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పిల్లలందరినీ బడికి పంపించి చదివించేలా తల్లిదండ్రులకు సూచించాలని, వివాహాలు నిర్వహించే సమయంలో వధూవరుల వయసును తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.

కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం 2006లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని, బాల్య వివాహాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో అన్ని మతాల పెద్దల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహాలు చేయకూడదని స్పష్టం చేశారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వహించాలని కోరారు.

గత ఏడాది కాలంలో జిల్లాలో అధికారులు 12 బాల్య వివాహాలను అడ్డుకున్నారని వెల్లడించారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానాలకు చేరుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. బాలల దత్తత విషయంలోనూ చట్టబద్ధమైన విధానాలను పాటించాలని తెలిపారు.

ఎస్పీ మహేష్ బి. గితె మాట్లాడుతూ ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో బాల్య వివాహాల నివారణ, బాలల విద్య, హక్కుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. బాల్య వివాహాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, వివిధ మతాలకు చెందిన పూజారులు, పాస్టర్లు, ఖాజీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});