బీఎస్ఎఫ్ జవాన్లమంటూ నమ్మించి సైబర్ మోసం.. రూ.73 వేల స్వాహా
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్‌కు కుచ్చుటోపీ.. ఫోన్‌పే ద్వారా విడతలవారీగా నగదు బదిలీ
అపరిచితుల మాటలు నమ్మి యూపీఐ లావాదేవీలు చేయొద్దు: వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్
మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 26:
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు. తాజాగా బీఎస్ఎఫ్ జవాన్లమంటూ పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్‌ను మోసం చేసి రూ.73 వేల నగదును స్వాహా చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బీఎస్ఎఫ్ జవాన్లమంటూ పరిచయం..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ కలెక్టర్ చౌక్‌లోని సెల్ఫ్ చెక్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను బీఎస్ఎఫ్ జవానునని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 25వ తేదీన 27 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు రక్త పరీక్షలు చేయించాల్సి ఉందని, ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున చెల్లిస్తామని నమ్మబలికాడు.
పరీక్షల ఖర్చులో భాగంగా ముందుగా 50 శాతం నగదు చెల్లిస్తామని చెప్పి బాధితుడిని నమ్మించాడు. అనంతరం వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఫోన్‌పేలో వివిధ లావాదేవీలు చేయించాడు. ఈ క్రమంలో నిందితుడి సూచనలను అనుసరించిన ల్యాబ్ టెక్నీషియన్ తన ఫోన్‌పే ఖాతా నుంచి పలుమార్లు మొత్తం రూ.53,000 బదిలీ చేశాడు. అంతేకాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని ఫోన్‌పే ఖాతా నుంచి మరో రూ.20,000 బదిలీ చేయించాడు.
దీంతో బాధితులు మొత్తం రూ.73,000 నగదును కోల్పోయారు.
1930కు ఫిర్యాదు.. కేసు నమోదు
నిందితుడి వ్యవహారంపై అనుమానం రావడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు నమోదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో FIR No. 826/2026 కింద BNS సెక్షన్లు 316(5), 318(4), ఐటీ చట్టంలోని సెక్షన్ 66(D) ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఈ ఘటన నేపథ్యంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
గుర్తుతెలియని వ్యక్తులు బీఎస్ఎఫ్, ఆర్మీ లేదా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని చెప్పినా వెంటనే నమ్మకూడదు. వారి వివరాలను అధికారిక మార్గాల్లో ధ్రువీకరించుకోవాలి.
వాట్సాప్ వీడియో కాల్‌లో అపరిచితులు చెప్పినట్లు ఫోన్‌పే, గూగుల్ పే లేదా ఇతర యూపీఐ యాప్‌లలో లావాదేవీలు చేయకూడదు.
డబ్బులు స్వీకరించడానికి యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. పిన్ నమోదు చేస్తే మీ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యే ప్రమాదం ఉంది.
అపరిచితులు పంపించే లింకులు క్లిక్ చేయడం, అనుమానాస్పద చెల్లింపులు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
సైబర్ నేరాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని కోరారు. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలువరించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
