manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:22 pm Editor : user5442714

ఇందిరమ్మ బీమాపై స్పష్టత ఇవ్వాలి..

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బీఆర్‌ఎస్ చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ డిమాండ్

మన భారత్ :చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో నెలకొన్న పలు సందేహాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ డిమాండ్ చేశారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పరిధిలోకి గతంలో వివిధ వర్గాల వారికి అమలులో ఉన్న బీమా పథకాలను తీసుకువస్తున్నారా? లేక వాటిని నిలిపివేస్తున్నారా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

ముఖ్యంగా రైతులకు ఎంతో భరోసాగా ఉన్న రైతు బీమా పథకం కొనసాగుతుందా లేదా? అనే అంశంపై రైతుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొందన్నారు. గతంలో ఒకే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి రైతు బీమా వర్తించేదని, ప్రస్తుతం కొత్త పథకం అమలుతో రైతు బీమా పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా కార్మిక శాఖ ద్వారా అమలయ్యే బీమా, గీత కార్మికుల బీమా, చేనేత కార్మికుల బీమా, మత్స్యకారుల బీమా వంటి పథకాల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

గత కొంతకాలంగా రైతు బీమా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయినట్లు రైతుల నుంచి సమాచారం వస్తోందని, దీంతో ఇటీవల మరణించిన కొందరు రైతుల కుటుంబాలకు బీమా పరిహారం అందని పరిస్థితి ఏర్పడిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, ప్రీమియం చెల్లింపులు, పెండింగ్ క్లెయిమ్‌లు, అర్హులైన కుటుంబాలకు పరిహారం అందించే అంశాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయడంతో పాటు గతంలో వివిధ వర్గాలకు అందుతున్న బీమా ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. ఏ పథకం కొనసాగుతుంది? ఏ పథకం కొత్త పథకంలో విలీనం అవుతుంది? గతంలో ఉన్న బీమా అర్హతలు, కుటుంబ సభ్యుల వారీగా వర్తించే ప్రయోజనాలు యథావిధిగా ఉంటాయా? అనే అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా అధికారికంగా ప్రకటించాలి.

ప్రజలకు అందాల్సిన బీమా ప్రయోజనాలు ఎలాంటి గందరగోళం, జాప్యం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});