manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 3:42 pm Editor : user5442714

కుటుంబ పరువు పేరుతో కన్నకూతురి దారుణ హత్య..

కుటుంబ పరువు పేరుతో కన్నకూతురి దారుణ హత్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రేమ వ్యవహారం తెలుసుకుని 18 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపిన తండ్రి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన పరువు హత్య.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

మన భారత్, నార్నూర్, నవంబర్ 26:

కుటుంబ పరువు పోతుందనే భావనతో కన్నతండ్రే తన 18 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే వెల్లడించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి, అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

నిశ్చితార్థానికి ముందే విషాదం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్ కుమార్తె కల్యాణి (18)కి ఈ నెల 25న నార్నూర్‌కు చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 23న కల్యాణి దిగులుగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలో తనకు మేనత్త కుమారుడితో ప్రేమ సంబంధం ఉన్నట్లు కల్యాణి తండ్రికి తెలిపింది.

ఈ విషయం తెలుసుకున్న తండ్రి కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కుటుంబ పరువు పోతుందనే భావనతో కుమార్తెపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున కల్యాణి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఆత్మహత్యగా చిత్రీకరించి అంత్యక్రియలు

కుమార్తెను హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా కైలాస్ ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పెళ్లి ఇష్టం లేక కల్యాణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మృతిచెందిన కొద్ది గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశాడు.

అయితే ఘటనపై గ్రామస్తులకు అనుమానాలు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నార్నూర్ సీఐ గురుస్వామి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో బయటపడిన అసలు నిజం

పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టగా, కుటుంబ పరువు పోతుందనే కారణంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు తండ్రి కైలాస్ అంగీకరించినట్లు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కన్నకూతురి ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించలేక తండ్రే హత్యకు పాల్పడిన ఈ ఘటన ఉమ్రి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రిపోర్టర్: ఖైదీ ఉమర్ మన భారత్ ఉట్నూర్



(adsbygoogle = window.adsbygoogle || []).push({});