manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 1:41 am Editor : user5442714

ఎమ్మెల్యే సంజయ్ ను విమర్శించడం భోగ శ్రావణికి తగదు

ఎమ్మెల్యే సంజయ్ ను విమర్శించడం భోగ శ్రావణికి తగదు
– జగిత్యాల అభివృద్ధిపై భోగ శ్రావణి బహిరంగ చర్చకు సిద్ధమా
– జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య
జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ :
జగిత్యాల పట్టణ అభివృద్ధి, పద్మశాలి సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతపై బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంటూ జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా ఎస్సీ సెల్ డీసీసీ అధ్యక్షుడు దూమాల రాజ్‌కుమార్ తదితరులు విలేకరుల సమావేశంలో విమర్శలు గుప్పించారు.
– జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందయ్య మాట్లాడుతూ
గత కొన్ని రోజులుగా భోగ శ్రావణి జగిత్యాల అభివృద్ధి, పద్మశాలి సామాజిక వర్గం గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులు పద్మశాలి సేవా సంఘంలో బాధ్యతలు నిర్వహించిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని, సంఘం నుంచి బహిష్కరణకు గురైన చరిత్ర ఉందని విమర్శించారు. పద్మశాలి వర్గం అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే ముందు గతాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. భోగ శ్రావణి గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అవకాశం పొందారని, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఆమె మున్సిపల్ పాలన సమయంలో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నాయకులు కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. హరితహారం, ట్రాక్టర్ల కొనుగోలు, ఆటోలు, స్వీపింగ్ యంత్రాలు, భూములు తదితర అంశాల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. పద్మశాలి సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ జగిత్యాల, ధర్మపురి మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పదవులను పద్మశాలి వర్గానికి కల్పించడంతో పాటు నేతన్నల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలను చెల్లించేందుకు రూ.350 కోట్ల నిధులు విడుదల చేయడం, నేతన్నలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు, వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు వంటి చర్యలను ప్రస్తావించారు. జగిత్యాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ, భోగ శ్రావణి ఎక్కడ, ఎప్పుడు చర్చకు పిలిచినా తాను ఒక్కడినే వచ్చి ఎదుర్కొంటానని సవాల్ విసిరారు. అన్నారు.
– మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాట్లాడుతూ
చేనేత కార్మికుల చేయూత పెన్షన్ విషయంలో జరిగిన పొరపాట్లను పరిశీలించి సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ, వాటిపై అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. భోగ శ్రావణి గత మున్సిపల్ పాలనలో జరిగిన పనులు, ఎజెండాలు, ఆరోపణలపై పూర్తి వివరాలను ప్రజావేదికపై ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జిల్లా ఎస్సీ సెల్ డీసీసీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ
భోగ శ్రావణి, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్, ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పద్మశాలి సామాజిక వర్గానికి గౌరవం, ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆమెకు గతంలో చైర్‌పర్సన్ పదవితో పాటు, ఆ వర్గానికి చెందిన పలువురికి కౌన్సిలర్ టికెట్లు ఇచ్చారని అన్నారు. రాజకీయ అవకాశాలను పొందిన అనంతరం బీజేపీలో చేరి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ పాత్రికేయ సమావేశములో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగ బూషణం, బండ శంకర్, జగిత్యాల టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, పట్టణ మహిళా అధ్యక్షులు పిప్పరి అనిత, మాజీ వైస్ చేర్మెన్ సిరాజుద్దీన్ మన్సూర్, కౌన్సిలర్లు సుంకేటి మమత రామకృష్ణ రెడ్డి, ఖాజా కమలుద్దీన్, వసికుద్దీన్ అన్సారీ, నాయకులు కూసరి అనిల్, పోతునుక మహేష్, బీరం రాజేష్, తోట నరేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});