పోలీసుల ఆధీనంలోని 49 వాహనాలను యజమానులు తిరిగి పొందేందుకు అవకాశం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అసలు ధ్రువపత్రాలు సమర్పించి వాహనాలు తీసుకెళ్లాలి
2027 ఏప్రిల్ 29 వరకు గడువు.. అనంతరం మిగిలిన వాహనాలకు ఈ-వేలం
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రకటన
మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25:
ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న, అలాగే గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన వాహనాల యజమానులకు జిల్లా పోలీస్ శాఖ కీలక అవకాశం కల్పించింది. జిల్లాలోని 21 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసుల ఆధీనంలో ఉన్న 49 వాహనాలను వాటి అసలు యజమానులు తిరిగి పొందేందుకు ఆరు నెలల గడువు ఇస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్నవి, అలాగే గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన వాహనాలు కొంతకాలంగా పోలీస్ స్టేషన్లలోనే ఉండిపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని గుర్తించి మొత్తం 49 వాహనాల వివరాలను సేకరించినట్లు తెలిపారు.
ఆరు నెలల్లో ధ్రువపత్రాలు సమర్పించాలి
వాహనాల అసలు యజమానులు తమ వాహనాలను తిరిగి పొందేందుకు 2026 అక్టోబర్ 29 నుంచి 2027 ఏప్రిల్ 29 వరకు గడువు కల్పించారు. ఈ వ్యవధిలో సంబంధిత యజమానులు తమ గుర్తింపు కార్డు (ఐడీ కార్డు), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ కార్డు) తదితర సరైన ధ్రువపత్రాలను సమర్పించి వాహనాలను స్వాధీనం చేసుకోవచ్చని ఎస్పీ సూచించారు.
సోషల్ మీడియా ఖాతాల్లో వాహనాల వివరాలు
పోలీసుల ఆధీనంలో ఉన్న 49 వాహనాలకు సంబంధించిన వివరాలు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు, ఇంజిన్ నంబర్లను జిల్లా పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు అధికారికంగా నిర్వహిస్తున్న SPAdilabad పేరుతో ఉన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పరిశీలించి తమ వాహనాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని సూచించారు.
గడువు ముగిసిన తర్వాత ఈ-వేలం
కేటాయించిన ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా యజమానులు ఎవరూ ముందుకు రాని, మిగిలిపోయిన వాహనాలను స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. కాబట్టి సంబంధిత వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి తమ వాహనాలను తిరిగి పొందాలని కోరారు.
వాహనాల స్వాధీనం, ధ్రువపత్రాల సమర్పణకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా వివరాలు కావాలంటే రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ టి. మురళిని 8712659962 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
