ఆదిలాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్ర వ్యక్తి అరెస్ట్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
యువతను లక్ష్యంగా చేసుకుని చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయం.. గ్రాము రూ.200 చొప్పున అమ్మకం
నిందితుడిపై గతంలో 15 కేసులు.. ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయించినట్లు వెల్లడి
మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25:
ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడిపై గతంలోనే 15 కేసులు నమోదైనట్లు వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కిన్వట్ పట్టణానికి చెందిన షేక్ కుర్బాన్ (56) సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని నాందేడ్, బోకర్ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసేవాడు. అనంతరం గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేవాడు.
విచారణలో భాగంగా ఆదిలాబాద్‌కు చెందిన పలువురికి ఒక్కో గ్రాము గంజాయిని రూ.200 చొప్పున విక్రయించినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, రూరల్, తలమడుగు, మావల, జైనథ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయించినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 400/2026, ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టంలోని సెక్షన్ 8(c) రెడ్ విత్ 20(b)(ii)(A), 27(b) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మహారాష్ట్రలోని కిన్వట్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్‌కు తరలించారు.
జిల్లాలో గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
