manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 1:40 pm Editor : user5442714

సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ..

ఆదిలాబాద్ రైల్వే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి – సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25

ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే ప్రయాణికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే పరంగా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ పనులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

కొత్త ఆర్‌యూబీల నిర్మాణానికి విజ్ఞప్తి

భోరజ్, గిమ్మ గ్రామాల సమీపంలో కొత్త రోడ్ అండర్ బ్రిడ్జిలు (RUB) నిర్మించడంతో పాటు ఆదిలాబాద్ పరిధిలో మరో ప్రాంతంలో కూడా ఆర్‌యూబీ మంజూరు చేయాలని కోరారు. వీటి నిర్మాణం పూర్తయితే రైతులు తమ వ్యవసాయ భూములకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే మహాలక్ష్మివాడ ఆర్‌యూబీ సమీపం నుంచి వ్యవసాయ భూములకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

తటిగూడకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తటిగూడ ప్రాంతానికి పాదచారులు, తేలికపాటి వాహనాల రాకపోకలకు అనుకూలంగా లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.

ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ పనుల్లో జాప్యాన్ని నివారించాలి

ఆదిలాబాద్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB), రోడ్ అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణ పనులు తీవ్ర జాప్యానికి గురవుతున్నాయని, దీంతో ప్రజలు నిత్యం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత పనులను వేగవంతం చేసి నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి జీఎం సానుకూల స్పందన

ఎమ్మెల్యే పాయల్ శంకర్ అందించిన వినతులపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. ప్రజలు, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా రైల్వే అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలు, రైతులకు అవసరమైన రైల్వే సదుపాయాలు అందుబాటులోకి వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});