పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో అనుమతులు.. 48 గంటల్లో కీలక నిర్ణయం: సీఎం రేవంత్ రెడ్డి
ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్‌కు భూమి కేటాయింపు హామీ.. సంక్షోభ సమయంలో ఫీడ్ సరఫరాకు ప్రభుత్వ సహకారం
మన భారత్ హైదరాబాద్: తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అనుమతుల విషయంలో జాప్యాన్ని నివారించేందుకు త్వరలోనే సమగ్ర విధానాన్ని రూపొందించి సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. పౌల్ట్రీ రంగానికి అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తామని, పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇండియన్ పౌల్ట్రీ ఈక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో–2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పౌల్ట్రీ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు, ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు, భూమి వినియోగ మార్పిడి వంటి అంశాల్లో పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో బిల్డ్‌నౌ యాప్ ద్వారా అమలు చేస్తున్న సింగిల్ విండో అనుమతుల విధానాన్ని త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని వెల్లడించారు. దీనివల్ల కొత్తగా పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి సమయం, వ్యయభారం తగ్గుతాయని పేర్కొన్నారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు సమగ్ర ప్రతిపాదనలతో ముందుకు వస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
పౌల్ట్రీ పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారుతున్న మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా ఉత్పత్తుల సరఫరాపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న బఫర్ నిల్వలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించి పౌల్ట్రీ రంగానికి అవసరమైన మేరకు మొక్కజొన్న, సోయాబీన్ సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో సమీక్షించి 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పౌల్ట్రీ పరిశ్రమ కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా రైతులు, రైతు కూలీల ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతోందని సీఎం ప్రశంసించారు. రైతులు పండించే మొక్కజొన్న, సోయాబీన్‌తో పాటు నూకలు, తౌడు వంటి ఉప ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి మార్కెట్‌ను కల్పిస్తోందన్నారు. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తి ద్వారా యువతకు ప్రొటీన్‌తో కూడిన ఆహారం అందించడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
తెలంగాణలో ప్రతిరోజూ సుమారు 5.30 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు, చికెన్‌తో కూడిన భోజనం అందించడంలో పౌల్ట్రీ రంగం సహకారం ఉపయోగపడుతోందన్నారు.
ఐటీ, ఫార్మా, డిఫెన్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లతో పాటు పౌల్ట్రీ పరిశ్రమను కూడా ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించిందన్నారు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటాను ప్రస్తుత 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పెట్టుబడిదారులకు భద్రత, పరిశ్రమలకు స్థిరమైన విధానాలు అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, IPEMA అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, పౌల్ట్రీ రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
