ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 24:
జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి నిరుపేదలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను, కార్యవర్గ సభ్యులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన గ్రామాల్లోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయాలని సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా డిసెంబర్‌లో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో గ్రామీణ ప్రాంత యువతను భాగస్వాములను చేయాలన్నారు.
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో 14–18 ఏళ్ల విద్యార్థులు జూనియర్ రెడ్‌క్రాస్‌లో, 18–30 ఏళ్ల యువత యూత్ రెడ్‌క్రాస్‌లో (www.redcross.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా) పెద్ద ఎత్తున చేరేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మాదకద్రవ్యాల అనర్థాలపై పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయాలని డీఈవో, డీఐఈవో, ప్రాంతీయ సంచాలకులను ఆదేశించారు.
వీరు జనవరి 12, 2027న లోక్‌భవన్‌లో గవర్నర్‌తో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అలాగే సేవా కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాసంస్థలకు గవర్నర్ చేతుల మీదుగా ‘రెడ్‌క్రాస్ లోక్‌భవన్ స్వామి వివేకానంద యూత్ అవార్డ్స్–2026’ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
రెడ్‌క్రాస్ పాత భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, పట్టణంలో సొసైటీకి కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఆర్. క్రాంతి కుమార్, వైస్ చైర్మన్ మనోహర్, కార్యవర్గ సభ్యులు కలెక్టర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. సమావేశంలో సభ్యులు కె. పార్థసారథి, సంజీవరావు, రాజు, రూపేష్ రెడ్డి, ఉషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
