ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక దీపారాధనలు.. దీపకాంతులతో వెలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
మన భారత్, తలమడుగు:నవంబర్ 23, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తలమడుగు మండలంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మంగళవారం మండలంలోని పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పవిత్ర కార్తీక స్నానాలు ఆచరించి, ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు, దీపారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివకేశవులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
తలమడుగు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ప్రత్యేక దీపారాధనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దీపాల వెలుగులతో దేదీప్యమానంగా మారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉండటంతో మహిళలు, యువత, గ్రామస్తులు, పెద్దలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
