వేసవి నాటికి తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాలు.. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచన
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 23:
వేసవి కాలం ప్రారంభమయ్యే నాటికి జిల్లాలోని ఏ గ్రామంలోనూ, పట్టణ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో సమన్వయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న సమస్యలకు తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనులు, మోటార్లు, పైప్లైన్ల మరమ్మతులు, బోర్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, నీటి సంరక్షణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత నీటి పరిస్థితి, వేసవిలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణానికి అవసరమైన రోజుకు 6 ఎంఎల్డీ తాగునీటిని ఫిబ్రవరి, మార్చి నెలల నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మిషన్ భగీరథ పరిధిలోని సంపులు, పైప్లైన్లలో ఉన్న లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయని పంపుసెట్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట కొత్త మోటార్లను ఏర్పాటు చేయాలని, ఈ పనుల్లో ఒక్కరోజు కూడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.
గ్రామాల్లో చిన్నపాటి తాగునీటి సమస్యలు తలెత్తినప్పుడు డీపీఓ, ఎంపీడీఓలు సమన్వయంతో గ్రామ పంచాయతీల ద్వారానే మరమ్మతులు పూర్తి చేయించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా గ్రిడ్, ఇంట్రా పరిధిలో చేపట్టాల్సిన తాగునీటి పనులకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలను రెండు, మూడు రోజుల్లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అటవీ ప్రాంతాల్లో తాగునీటి పైప్లైన్ల నిర్మాణానికి అవసరమైన అటవీ శాఖ అనుమతుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాలువల నుంచి రాత్రివేళల్లో అక్రమంగా నీటిని తోడేందుకు వినియోగిస్తున్న ఆయిల్ ఇంజిన్లను స్వాధీనం చేసుకొని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నాలాల పరిధిలో ఆక్రమణలను తొలగించిన తర్వాతే రక్షణ గోడల నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ శాఖకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు మూడో వైరు పనులను వేగవంతం చేయాలని సూచించారు. పగటిపూట వీధి దీపాలు వెలగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల్లో పశువుల నీటి తొట్టెలు, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ పిట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు అవసరమైన టీకాల పంపిణీ సక్రమంగా జరిగేలా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు ముందుగానే గుర్తించి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఇన్ఛార్జి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్, మిషన్ భగీరథ ఈఈ చంద్రమోహన్, భూగర్భజల శాఖ ఏడీ సతీష్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, డీపీఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇరిగేషన్ ఈఈతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
