manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 3:01 pm Editor : Editor Vishal Kumar

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి.. ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేసిన నాయకులు

ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో మహా పాదయాత్ర.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

మన భారత్, సికింద్రాబాద్:

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవడం ద్వారా దేశ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కుటుంబాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

సికింద్రాబాద్ ప్యాట్నిలోని మహబూబ్ కాలేజీలో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘ప్రవాసి మిలన్’ కార్యక్రమం అవగాహన సందేశంతో సాగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ నటి పాయల్ రాధాకృష్ణతో పాటు వివిధ నాన్ తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞలో పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తుల ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, సామాజిక జీవనం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారి విద్య, ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

యువతే దేశానికి అసలైన సంపద

భారతదేశానికి యువతే ప్రధాన బలమని, యువశక్తి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. యువతలో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, పట్టుదల, నైపుణ్యాలను పెంపొందించాల్సిన సమయంలో వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను సమాజం ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత సమస్యగా మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశాభివృద్ధిపై ప్రభావం చూపే తీవ్రమైన సమస్యగా గుర్తించాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు గమనించాలని, విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.

25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో మహా పాదయాత్ర

ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఈ పాదయాత్ర ద్వారా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, డ్రగ్స్ నిర్మూలనకు సామాజిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నది నిర్వాహకుల ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తమ కుటుంబం నుంచే మార్పును ప్రారంభించి, పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువతను రక్షించుకోవడం అంటే దేశ భవిష్యత్తును కాపాడుకోవడమేనని, నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 



(adsbygoogle = window.adsbygoogle || []).push({});