manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 3:04 pm Editor : user5442714

కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలు నిరాధారం.. బీజేపీ రాష్ట్ర నాయకుడు నగేష్ తీవ్ర విమర్శలు

కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలు నిరాధారం.. బీజేపీ రాష్ట్ర నాయకుడు నగేష్ తీవ్ర విమర్శలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 18, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర నాయకుడు నగేష్ తీవ్రంగా ఖండించారు. అమెరికా నుంచి ఆదిలాబాద్‌కు వచ్చినప్పటి నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి తన వ్యాఖ్యలతో ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగేష్ మాట్లాడుతూ.. గతంలో మాజీ మంత్రి జోగు రామన్నపై విమర్శలు చేసిన కంది శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుతం ఆయనతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ ఎలాంటి ఆధారాలు, కేసులు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున, నిజంగా భూకబ్జాలు జరిగాయని భావిస్తే సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కంది శ్రీనివాస్ రెడ్డికి నగేష్ సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే హయాంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం

ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాయకత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని నగేష్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయ మంజూరుతో పాటు పారిశ్రామిక కారిడార్ పనుల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. అలాగే ఆర్‌యూబీ, ఆర్‌ఓబీ నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించకుండా విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో కేంద్రం వాటా లేదా?

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందనే విషయాన్ని కంది శ్రీనివాస్ రెడ్డి గుర్తించాలని నగేష్ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న పథకాలపై పూర్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మెజారిటీ మద్దతు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర అవగాహనతో వ్యవహరించి మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరకుండా అడ్డుకున్నాయని నగేష్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల రాజకీయ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో జోగు రవి, జీవన్, శ్రీకాంత్, మనోజ్, శివ, సతీష్, బొమరెడ్డి, విలాస్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});