manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 3:48 pm Editor : user5442714

పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్ వృద్ధులు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్
వృద్ధులు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తలమడుగు:నవంబర్ 17,

పేదలు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పెద్దపీట వేశారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులకు ప్రస్తుత ప్రభుత్వం నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో నిర్వహించిన చేయూత ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. గతంలో కేవలం రూ.200గా ఉన్న ఆసరా పెన్షన్‌ను రూ.2,000కు పెంచి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించారని పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం కూడా అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులను గుర్తించి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.

రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందించాలి

ఇటీవల వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇందిరా జీవిత బీమా పథకం కింద పరిహారం అందించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఆగస్టు 14వ తేదీ నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో బీమా పథకానికి దూరమైన రైతు కుటుంబాలను కూడా ఇందిరా కుటుంబ బీమా పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అర్హులైన రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందించి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ రాజ్ మోహన్, సుంకిడి గ్రామ సర్పంచ్ మగ్గిడీ నర్సమ్మ ప్రకాష్, తలమడుగు సర్పంచ్ ఎలుగు రాజన్న, ఖోడాద్ సర్పంచ్ ఎముల ప్రియాంక లక్ష్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});