భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన బిర్సా ముండా సేవలు చిరస్మరణీయం
మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 15, ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం, స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హీరాసుకా ఆదివాసీ జాగృతి వెల్ఫేర్ సొసైటీ, ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న భగవాన్ బిర్సా ముండా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలు, ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం సాగించిన ఉద్యమాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
భగవాన్ బిర్సా ముండా ఆదివాసీ సమాజ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, భూమి పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన గొప్ప ఉద్యమకారుడిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ గిరిజనుల్లో చైతన్యం నింపిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, వారి సంస్కృతి సంప్రదాయాల కొనసాగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హీరాసుకా ఆదివాసీ జాగృతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సిడాం రాంకిషన్, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, స్థానికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
