విద్యార్థుల భవిష్యత్తుకు గ్రంథాలయాలే పునాది
జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే పాయల్ శంకర్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14,
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ముందుగా సరస్వతీ దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గ్రంథాలయాలు పునాదులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవడమే కాకుండా, పోటీ పరీక్షలకు అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా లభించే జ్ఞానం శాశ్వతమైనదని, ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో కూడా గ్రంథాలయానికి అవసరమైన వసతుల కల్పనలో తనవంతు సహకారం అందించానని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ గ్రంథాలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
అదేవిధంగా గ్రంథాలయంలో పుస్తకాలు చదివి, నిరంతర సాధనతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించాలని సూచించారు. వారి విజయగాథలను ఇతర విద్యార్థులకు తెలియజేయడం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. గ్రంథాలయాలను కేవలం పుస్తకాలు చదివే కేంద్రాలుగా కాకుండా, విద్యార్థుల లక్ష్య సాధనకు మార్గదర్శక కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసయ్య, జోగు రవి, శ్రీకాంత్, మనోజ్, పోషాలు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
