నెహ్రూ ఆశయాలు, దేశ నిర్మాణానికి చేసిన సేవలు చిరస్మరణీయం
ఆధునిక భారతదేశ అభివృద్ధికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14,
భారతదేశ ఆధునిక నిర్మాణానికి పునాదులు వేసి, దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన మహానేత భారతరత్న, భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నెహ్రూ ఆశయాలు, దేశానికి ఆయన అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌లోని విజయ డైరీ సమీపంలో ఉన్న విజ్ఞాన్ స్పెషల్ స్కూల్‌ను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. పాఠశాల చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు. చిన్నారులతో కొంత సమయం గడుపుతూ వారిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశేష కృషి చేశారని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం, లౌకికవాద విలువలను కాపాడటం, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడంలో నెహ్రూ అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించినప్పుడే దేశ భవిష్యత్తు మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
