manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 8:46 am Editor : user5442714

నవంబర్‌లోనే ఎండిపోయిన అందర్ బంద్ వాగు.. రానున్న వేసవిలో తాగునీటి కష్టాలపై ఆందోళన

నవంబర్‌లోనే ఎండిపోయిన అందర్ బంద్ వాగు.. రానున్న వేసవిలో తాగునీటి కష్టాలపై ఆందోళన




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, భీంపూర్: నవంబర్ 14,

భీంపూర్ మండలంలోని అందర్ బంద్ వాగు నీరు లేక వెలవెలబోతోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నీటితో కళకళలాడే ఈ వాగు, ఈ ఏడాది నవంబర్ నెలలోనే నీరు తగ్గిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వాగులో నీటి నిల్వలు తగ్గిపోయి కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం వాగులో నీరు లేకపోవడంతో రానున్న వేసవిలో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పశువులు, అడవి జంతువులు, ఇతర వన్యప్రాణులకు తాగునీరు లభించడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు. నీటి కోసం వన్యప్రాణులు సమీప గ్రామాలు, జనావాసాల వైపు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏడాది వేసవి కాలంలోనూ వాగులు, చెరువుల్లో నీరు కొంతమేర అందుబాటులో ఉండేదని, ఈసారి మాత్రం నవంబర్‌లోనే నీటి కొరత కనిపిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటినుంచే నీటి సంరక్షణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, వాగులు, చెరువుల్లో నీటి నిల్వలు పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

వేసవి తీవ్రత పెరిగేలోపు పశువులు, వన్యప్రాణులకు తాగునీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్: గేడం రమాకాంత్, భీంపూర్ మండలం.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});