ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం.. భారత్ సమ్మిట్‌తో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి
మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరులు తెలంగాణ బలం – 70 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల పరిచయం – యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనువైన పారిశ్రామిక వాతావరణం ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడమే భారత్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు, యువతకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు సంబంధించి బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’కు ముందు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే భారత్ సమ్మిట్ లక్ష్యమని సీఎం వివరించారు. గత ఏడాది కూడా ఈ సదస్సును నిర్వహించామని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
ఈసారి భారత్ సమ్మిట్‌కు దాదాపు 70 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మంత్రులు, పర్యావరణవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, జర్నలిస్టులు సహా సుమారు వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించినట్లు వెల్లడించారు. రెండు రోజులపాటు వివిధ అంశాలపై చర్చలు, సెమినార్లు నిర్వహించి, కీలక తీర్మానాలు రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు తిరిగి తమ దేశాలకు వెళ్లిన తర్వాత తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు, మానవ వనరుల వినియోగం, అనుకూలమైన పారిశ్రామిక వాతావరణం వంటి కీలక అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని, వివిధ రంగాల నిపుణుల సూచనలను స్వీకరించి అత్యుత్తమ విధానాలను అమలు చేయడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్‌ఫామ్ వర్కర్లు, కొరియర్ సిబ్బంది, డ్రైవర్లు, గృహ కార్మికులు తదితరులకు తగిన సామాజిక భద్రత, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యుత్తమ గిగ్ వర్కర్స్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈ విధానాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు వెల్లడించారు. భారత్ సమ్మిట్లోనూ రాహుల్ గాంధీ తన సందేశాన్ని వినిపించనున్నారని చెప్పారు.
ఢిల్లీలో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను ఆహ్వానించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. గతంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని దేశ ప్రతినిధిగా విదేశాలకు పంపిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా సహకారం ఉండాలని అభిప్రాయపడ్డారు.
భారత్ సమ్మిట్‌ను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక, సాంకేతిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
