రైతులకు అండగా ఉంటాం.. పంట రుణాల రీషెడ్యూల్కు కృషి చేస్తాం
ఫసల్ బీమా అమలులో ఉంటే ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు పరిహారం లభించేది
పంట రుణాలను 10 నుంచి 12 వాయిదాల్లో చెల్లించేలా ప్రభుత్వంతో చర్చలు
పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే పాయల్ శంకర్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, బేలా: నవంబర్ 13, రైతుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని, ఈ ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాల రీషెడ్యూల్కు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. బేలా మండల కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో శుక్రవారం ఆయన పత్తి కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు.
ముందుగా పత్తి బండ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, రైతులను సన్మానించి మిఠాయిలు తినిపించారు. అనంతరం పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రైతులకు ఫసల్ బీమా పంటల బీమా పథకం అమలులో ఉండి ఉంటే పంట నష్టపోయిన సందర్భంలో ఎకరానికి సుమారు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు పరిహారం పొందే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పంట రుణాల రీషెడ్యూల్ లేదా రుణాలను 10 నుంచి 12 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తోందని చెప్పారు.
పత్తి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాయితీలు కల్పించే అంశంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైతులు పత్తి పంటపైనే ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కూడా దృష్టి సారించాలని సూచించారు.
గ్రామస్థాయిలో గోదాముల ఏర్పాటుకు చర్యలు
రైతులు పండించిన పంటలను వెంటనే విక్రయించాల్సిన పరిస్థితి లేకుండా నిల్వ చేసుకునేందుకు ప్రతి గ్రామంలో చిన్న చిన్న గోదాములు నిర్మించే ప్రతిపాదన ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ గోదాముల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ మంజూరు దశలో ఉందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో గోదాములు అందుబాటులోకి వస్తే రైతులు తమ పంటలను అవసరమైన సమయంలో విక్రయించుకునే అవకాశం ఉంటుందని, తద్వారా గ్రామపంచాయతీలకు కూడా ఆదాయం సమకూరుతుందని వివరించారు.
మద్దతు ధరకు తక్కువగా కొనుగోలు చేస్తే చర్యలు
పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించినట్లు పాయల్ శంకర్ తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు పత్తి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తే రైతులకు ప్రయోజనకరమని, ఈ విషయంలో అనవసర గందరగోళం సృష్టించకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
మరో 2 వేల స్ప్రింక్లర్ల కోసం ప్రయత్నం
వ్యవసాయానికి అవసరమైన స్ప్రింక్లర్ల కోసం ఇంకా దరఖాస్తు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 2 వేల స్ప్రింక్లర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా సాగడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అధికారులు, మార్కెట్ కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
