manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 1:59 pm Editor : user5442714

ఆదివాసీ గ్రామాలకు రహదారులు కల్పించాలి – తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి: తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్

ఆదివాసీ గ్రామాలకు రహదారులు కల్పించాలి – తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి: తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తలమడుగు:నవంబర్ 12,

తలమడుగు మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తలమడుగు మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని దేవాపూర్, బరంపూర్, చర్లపల్లి, ఝరి, రత్నపూర్ గ్రామాలను సందర్శించి స్థానికంగా నెలకొన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రహదారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆదివాసీ గ్రామాలకు కనీసం రహదారి సౌకర్యం కల్పించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికీ అనేక ఆదివాసీ గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు లేకపోవడంతో విద్య, వైద్యం, రవాణా వంటి అత్యవసర సేవలు పొందడంలో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి దేవాపూర్ చెక్‌పోస్ట్ నుంచి పునాగూడ వరకు రహదారిని, ఝరి నుంచి రత్నపూర్ వరకు రహదారిని మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి రహదారుల నిర్మాణం ఎంతో కీలకమని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా తలమడుగు మండలంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని గోడం గణేష్ డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవసరమైన సహాయం అందించాలని కోరారు.

ఈ క్షేత్రస్థాయి పర్యటనలో తుడుం దెబ్బ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెట్టి మనోజ్, రాష్ట్ర కార్యదర్శి అర్కా శేషారావు, జిల్లా ఉపాధ్యక్షులు కుముర జ్ఞానేష్, ఆత్రం భరత్, మండల అధ్యక్షుడు జంగల పోచన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం బుజంగారావు, రైతు సంఘం అధ్యక్షుడు పెందూర్ మాధవరావు, ఉపాధ్యక్షుడు అనక రాంజీ, సర్పంచులు ఆత్రం సూర్యబాన్, ఆత్రం అశోక్, మాజీ సర్పంచ్ తొడసం హేమంత్, పటేళ్లు పెందూర్ జైతు, మెస్రం నాగోరావు, నైతం బాజేరావు, ఆత్రం సీతారాం, పెందూర్ శంభు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల ప్రజలు కూడా పర్యటనలో పాల్గొని తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});