తొలివిడతలో 21 కిలోమీటర్‌మేర పునరుజ్జీవనం.. హైదరాబాద్ భవిష్యత్తు తరాల కోసమే ఈ ప్రాజెక్టు: సీఎం రేవంత్ రెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, హైదరాబాద్:
హైదరాబాద్ నగర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. మొత్తం 55 కిలోమీటర్ల పొడవున్న మూసీ నదిలో తొలివిడతగా 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళన అనేది కేవలం సుందరీకరణ కార్యక్రమం కాదని, నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు తరాల జీవన ప్రమాణాలతో ముడిపడిన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ నగరంలోని చెరువులను ఆక్రమణల నుంచి కాపాడి పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాల అమలులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి నగర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
తమ్మిడికుంట చెరువు గతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, పునరుద్ధరణలో భాగంగా 30 ఎకరాలకు విస్తరించి సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున రెండు ఎకరాల భూమిని అందించి సహకరించారని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సమాజ ప్రయోజనాల కోసం ముందుకొచ్చిన నాగార్జున నిజజీవితంలోనూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
చెరువుల పరిరక్షణతోనే నగరానికి భవిష్యత్తు
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో సగానికి పైగా కనుమరుగయ్యాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, పట్టణీకరణ కారణంగా జలవనరులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తమ్మిడికుంటతో పాటు బతుకమ్మకుంట, బుమ్-రుక్నుద్దౌలా, సున్నం చెరువు, నల్లచెరువు, ఫాక్స్ సాగర్, మియాపూర్ చెరువు తదితర ప్రాంతాల్లో దాదాపు 20 చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.
చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికావడం వల్ల వర్షాకాలంలో నగర రహదారులు జలమయమవుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని అన్నారు. నీరు నిల్వ ఉండాల్సిన ప్రాంతాలను ఆక్రమించుకోవడం వల్ల వరద నీరు నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని వివరించారు.
1908లో వచ్చిన భారీ వరదల అనంతరం నిజాం ప్రభుత్వం నిపుణుల సూచనలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించిందని గుర్తుచేశారు. వందేళ్లకు పైగా కాలం గడిచినా అవి హైదరాబాద్ ప్రజలకు నీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
కాలుష్య నివారణకు మూసీ ప్రక్షాళన
మూసీ నది కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు, నది పరివాహక ప్రాంత ప్రజలు కలుషిత నీటి ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూసీలోకి చేరుతున్న మురుగునీరు, వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాల వల్ల నది మురికికూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సబర్మతీ, గంగా, యమునా నదుల అభివృద్ధి నమూనాలను ప్రస్తావిస్తూ నదీ పరివాహక ప్రాంతాలు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కేంద్రాలుగా మారగలవని వివరించారు. మూసీ ప్రక్షాళనలో ఎవరికీ అన్యాయం జరగకుండా బాధితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
మహిళా సంఘాలతో లేక్ ఎకానమీ
పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువు నిర్వహణ బాధ్యతలను సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేసి చిన్నచిన్న వ్యాపార కార్యకలాపాలకు అవకాశం కల్పించడం ద్వారా లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలని చెప్పారు. చెరువు పరిసరాలను సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా తీర్చిదిద్దాలని, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీ అధ్యక్షత వహించగా, సినీనటుడు అక్కినేని నాగార్జున, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
