manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 1:02 am Editor : user5442714

ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించిన.. ఎమ్మెల్యే గండ్ర

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రైతులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం – ధాన్యం

కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నవంబర్ 11:రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వారి సంక్షేమానికి పెద్దపీట వేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రైతులకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండల పరిధిలోని దూత్‌పల్లి, ఒడితల, జడలపేట, నైన్‌పాక, అందుకుతండా, గిద్దెముత్తారం, నవాబుపేట తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సకాలంలో కొనుగోలు చేసి, వారికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం, అక్రమాలకు తావులేకుండా అధికారులు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగిస్తూ పంటలను కాపాడుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు భద్రత, ఉచిత విద్యుత్, సన్న వడ్లకు బోనస్, పంట రుణమాఫీ వంటి పథకాలతో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, వారు పండించిన ప్రతి గింజకు న్యాయమైన ధర లభించేలా చూడటమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});