అవసరమైతే ఆలేరు నుంచే పోటీ చేస్తా.. బీసీల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతా: తీన్మార్ మల్లన్న
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆలేరు, నవంబర్ 10:
తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర ఆలేరు నియోజకవర్గానికి చేరుకుంది. యాత్రలో భాగంగా 48వ రోజు పాదయాత్ర నిర్వహించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్నకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలేరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక రాజకీయ పరిస్థితులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆలేరు నుంచే పోటీకి సిద్ధం
ఆలేరులో బీసీ జెండా ఎగరేసి తీరుతానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తన తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నానని, బీసీ వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. బీసీలపై అక్రమ కేసులు పెడితే సంబంధిత రాజకీయ నాయకులకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆలేరులోని బీసీ నాయకులు అగ్రవర్ణ రాజకీయ నాయకుల ముందు తలవంచడం మానుకొని, తమ వర్గాల ఆత్మగౌరవం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.
బీసీలకు రాజకీయ అధికారం దక్కాలి
తెలంగాణలో జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు పాలనలో తగిన వాటా లభించడం లేదని మల్లన్న విమర్శించారు. బీసీల జీవన పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం, రాజకీయంగా వారికి సముచిత స్థానం కల్పించడం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు వివరించారు. ఆలేరు ప్రాంతంలో బీసీల రాజకీయ అణచివేతకు గతంలోనే పునాదులు పడ్డాయని ఆరోపించారు. గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ బీసీ నాయకత్వానికి తగిన ప్రాధాన్యం కల్పించలేదని విమర్శించారు. రాష్ట్రంలోని 43 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ సంపదపై అన్ని వర్గాలకు సమాన హక్కులు ఉండాలని పేర్కొన్నారు. ఆలేరులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
42 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైంది?
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మల్లన్న ఆరోపించారు. డిక్లరేషన్లోని 15వ పేజీ, ఐదో అంశంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీని నెరవేర్చకుండా బీసీలను మోసం చేశారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు బీసీ రిజర్వేషన్లు 33 శాతంగా ఉండేవని, గత ప్రభుత్వ హయాంలో 23 శాతానికి తగ్గాయని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 19 శాతానికి కుదించబడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలను అసెంబ్లీ రికార్డుల ఆధారంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
బీసీ నిధుల మళ్లింపుపై ప్రశ్నలు
బీసీల అభివృద్ధి కోసం కేటాయించినట్లు పేర్కొన్న రూ.58 వేల కోట్ల నిధులు ఇతర అవసరాలకు మళ్లించారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీల జనాభా లెక్కల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బీసీల జనాభా రెండు కోట్లుగా పేర్కొనగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 1.80 కోట్లుగా ఎలా నమోదైందని ప్రశ్నించారు. జనాభా లెక్కల్లో వచ్చిన తేడాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మల్లన్న స్పష్టం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో బీసీల ఐక్యతను బలోపేతం చేసి రాజకీయ మార్పునకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
