manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:13 pm Editor : user5442714

ఆ పనులు వేగవంతం చేయాలి..

ఆదిలాబాద్‌లో ROB, RUB పనులు వేగవంతం చేయాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నిర్ణీత గడువులో నిర్మాణాలు పూర్తి చేయాలి.. అధికారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశాలు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 10,

ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు తొలగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB), రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆర్‌అండ్‌బీ శాఖ చీఫ్ ఇంజినీర్ (CE), సంబంధిత శాఖల అధికారులతో కలిసి నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ROB, RUB పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ ప్రక్రియ, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించిన సమస్యలు, వివిధ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇకపై ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు.

రూ.104.50 కోట్ల నిధుల సాధన.. భూసేకరణకు రూ.14.80 కోట్లు విడుదల

రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణాల కోసం రైల్వే శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండానే రూ.104.50 కోట్ల నిధులు తీసుకురావడంలో కృషి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల పరిష్కారానికి సంబంధించి రూ.14.80 కోట్ల నిధులు విడుదల చేయించామని వెల్లడించారు.

ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావించి కృషి చేశానని, ఇప్పుడు ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.

భూసేకరణకు సంబంధించిన అడ్డంకులను వెంటనే తొలగించాలని, రైల్వే, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులకు తెలిపారు.

ఈ ROB, RUB నిర్మాణాలు పూర్తయితే ఆదిలాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});