manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 2:09 pm Editor : Editor Vishal Kumar

వెయ్యి గ్రామాల మైలురాయిని దాటిన సమగ్ర భూ రీ-సర్వే

భూ యజమానుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యత.. పారదర్శకంగా సర్వే నిర్వహించాలి

చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భూ వివాదాలకు కారణం కాకూడదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మన భారత్ హైదరాబాద్: రాష్ట్రంలో తరతరాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీ-సర్వేను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూ రీ-సర్వే పురోగతిపై మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలు, సర్వే సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్రంగా చర్చించారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందితో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు. నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీ-సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో సర్వే ప్రక్రియ మైలురాయిని దాటగా, 416 గ్రామాల్లో సర్వే పూర్తయిందని వివరించారు.

సుమారు 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని, వేగంతో పాటు నాణ్యత, పారదర్శకత, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సర్వే:

ప్రతి గ్రామంలో సర్వే ప్రారంభించే ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. భూముల విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, సరిహద్దులకు సంబంధించిన వివరాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు.

భూ యజమానులకు నోటీసులు తప్పనిసరి:

సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. సర్వేలో నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు తగిన అవకాశం కల్పించాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.

రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి:

భూ రీ-సర్వే ఎలా నిర్వహిస్తారు? సర్వే అనంతరం నోటీసులు ఎలా జారీ చేస్తారు? అభ్యంతరాలను ఎక్కడ, ఎలా నమోదు చేయాలి? వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? అనే అంశాలపై గ్రామస్థాయిలో రైతులకు, భూ యజమానులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియపై ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

చిన్న పొరపాటు కూడా వివాదానికి దారితీయకూడదు:

సర్వేలో చిన్నపాటి తప్పిదం జరిగినా భవిష్యత్తులో పెద్ద భూ వివాదానికి కారణమయ్యే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా లోపాలు గుర్తించినట్లయితే వెంటనే సరిదిద్దాలని సూచించారు. భూ యజమానుల సంతృప్తే సర్వే విజయానికి ప్రామాణికంగా ఉండాలని, వారి అభిప్రాయాలు, సూచనలను గౌరవించాలని పేర్కొన్నారు.

భూదార్ కేటాయింపును వేగవంతం చేయాలి:

రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపునిచ్చే భూదార్ నంబర్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూముల హక్కులు, విస్తీర్ణం, సరిహద్దులకు సంబంధించి స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్:

భూ రీ-సర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. జిల్లా వారీగా పురోగతిని సమీక్షించి తదుపరి కార్యాచరణపై ఆదేశాలు ఇవ్వనున్నారు.

తరతరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే సమగ్ర భూ రీ-సర్వే ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు భూ వివాదాలు లేని తెలంగాణను అందించేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});