manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:28 pm Editor : user5442714

బీఆర్ఎస్‌కు యువకుల మద్దతు..

బీఆర్ఎస్‌కు యువజన మద్దతు..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బీజేపీ, కాంగ్రెస్‌లను వీడి పార్టీలో చేరిన యువకులు

జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 7, బోరజ్ మండలం కేదార్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి యువత మద్దతు పెరుగుతోంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు జోగు రామన్న పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ.. మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న కేదార్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంపై, మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వంపై విశ్వాసంతో బీఆర్ఎస్‌లో చేరినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామంలో పార్టీ బలోపేతానికి యువతను సమీకరించి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.

అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు చేకూరలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు, యువత తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని జోగు రామన్న ఆరోపించారు. పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను విస్మరిస్తూ, రైతాంగ ఇబ్బందులపై సరైన దృష్టి సారించడం లేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి వారికి అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు తగ్గుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, మద్దుల ఉషాన్న, సర్పంచ్ సంతోష్ రెడ్డి, మెట్టు ప్రహ్లాద్, పురుషోత్తం, భోజన్న, దయానంద్, మహేష్, బొట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});