సోయంగూడాలో వైభవంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు.. గిరిజనులతో కలిసి సందడి చేసిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు గుడిహత్నూర్ మండలంలోని సోయంగూడా గ్రామంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ ఆదివాసీ పండుగగా గుర్తింపు పొందిన ఈ వేడుకల్లో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, అడిషనల్ ఎస్పీ రుత్విక్ సాయి కొట్టెతో కలిసి ఆయన ఉత్సవాల్లో పాల్గొని ఆదివాసీలతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సాంప్రదాయ వేడుకలు, గుస్సాడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన గిరిజన కళాకారులు డప్పుల మోతలు, వాయిద్యాల నడుమ ప్రదర్శించిన దండారి నృత్యాలు ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. నాయకులు సైతం ఆదివాసీలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని వారి సంప్రదాయాలను ఆస్వాదించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతో విశిష్టమైనవని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న దండారి, గుస్సాడి వంటి సంప్రదాయ కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీల జీవన విధానం, కళలు, సంస్కృతి భారతీయ సంప్రదాయ వైవిధ్యానికి ప్రతీకలని తెలిపారు.
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలకు తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తొడసం దౌలత్ రావు, మాజీ మండల అధ్యక్షుడు అంకత్ రవి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగ్నాథ్ అప్ప, మండల ఉపాధ్యక్షుడు మొయితే మారుతి, మండల అధికార ప్రతినిధి ఆడే జైపాల్, మాజీ బోరిగాం ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి, బోథ్ మండల ఉపాధ్యక్షుడు రఫీక్, బోథ్ ఏఎంసీ డైరెక్టర్ షేక్ ఇసుబ్, పీఏసీ సభ్యుడు సత్యనారాయణ, కోట్నాక్ గణేష్, పవార్ రాజు, జాదవ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
