manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 2:15 pm Editor : user5442714

అభివృద్ధిపై ఎంపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం.!

ఆదిలాబాద్ అభివృద్ధిపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం.. కేంద్ర నిధులు తీసుకురావడంలో విఫలం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రైతాంగ సంక్షేమం, ఆదివాసీల అభ్యున్నతికి కేసీఆర్ పాలన ఆదర్శం: మాజీ మంత్రి జోగు రామన్న

మన భారత్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల సమయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఆశించిన స్థాయిలో కృషి చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. రైతాంగం అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా వాటి పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కంటే కమిషన్లకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.

దీపావళి దండారి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జైనథ్ మండలంలోని బెల్గాం గూడా గ్రామంలో నిర్వహించిన దండారి వేడుకలకు జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి సంప్రదాయ దండారి వేడుకల్లో పాల్గొని వారితో మమేకమయ్యారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

కేసీఆర్ పాలనలో ఆదివాసీ ప్రాంతాలకు ప్రాధాన్యత

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జోగు రామన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ ఆశయాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జోడేఘాట్ ప్రాంతంలో కొమురం భీమ్ విగ్రహానికి అధికారికంగా ఘన నివాళులు అర్పించినట్లు తెలిపారు.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.25 కోట్లతో జోడేఘాట్ మ్యూజియం నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు విద్య, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు గత ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

రైతుల పంటలకు సాగునీటి భరోసా

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జోగు రామన్న అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చనాక-కొరాట ప్రాజెక్టు ద్వారా పెన్‌గంగా పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల కొంతమేర పంటలను కాపాడుకునే అవకాశం కలిగిందని తెలిపారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతు సంక్షేమంపై కేసీఆర్‌కు ఉన్న ముందుచూపును తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

మిషన్ భగీరథతో గిరిజన గ్రామాలకు తాగునీరు

గతంలో ఆదివాసీ గ్రామాల్లో కలుషిత తాగునీటి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తేవని, మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని గ్రామాలకు అందించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆదివాసీలకు భూమి పట్టాలు అందించడంతో పాటు రైతుబంధు పథకం ద్వారా వ్యవసాయ పెట్టుబడి సాయం అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గిరిజన రైతులు తమ వ్యవసాయ భూముల్లో బోరుబావులు ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రోత్సాహం అందించామని గుర్తుచేశారు.

రైతాంగ సంక్షేమం, ఆదివాసీల అభ్యున్నతి, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు భవిష్యత్ తరాలకు సైతం ఆదర్శంగా నిలుస్తాయని జోగు రామన్న పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, రామ్ రెడ్డి, పురుషోత్తం, నితిన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మద్దుల ఉషన్న, గణేష్ యాదవ్, వెంకన్న, భోజన్న, పొండ్రు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});