గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా గుస్సాడి దండారి ఉత్సవాలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భావితరాలకు ఆదివాసీ సంప్రదాయాలను అందించాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
గిరిజనుల ఐక్యత, సోదరభావం, ఆత్మీయతకు దండారి వేడుకలు నిదర్శనం
పార్డి బి గ్రామంలో గుస్సాడి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన ఎస్పీ
మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 06:
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు గుస్సాడి దండారి ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అన్నారు. విశిష్టమైన గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సోనాల మండలం పార్డి బి గ్రామంలో నిర్వహించిన గుస్సాడి దండారి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ గుస్సాడి నృత్యాలను, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ సంస్కృతికి విశిష్టమైన గుర్తింపు ఉందన్నారు. గుస్సాడి దండారి వేడుకలు కేవలం పండుగలకే పరిమితం కాకుండా గిరిజన సమాజంలోని ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం, ఆత్మీయతను చాటిచెప్పే గొప్ప సాంస్కృతిక వేడుకలని పేర్కొన్నారు.
ఒక గ్రామానికి చెందిన దండారి బృందాలు మరో గ్రామానికి వెళ్లి అక్కడి ఉత్సవాల్లో పాల్గొనడం గిరిజనుల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఇటువంటి సంప్రదాయాలు సమాజంలో పరస్పర అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు గిరిజనుల ప్రత్యేక జీవన విధానాన్ని, కళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయని వివరించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన మూలాలను, పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆచార సంప్రదాయాలను మరిచిపోకూడదని సూచించారు. ముఖ్యంగా యువత, చిన్నారులకు ఆదివాసీ సంస్కృతి ప్రాధాన్యతను తెలియజేస్తూ గుస్సాడి నృత్యాలు, దండారి వేడుకల విశిష్టతను భావితరాలకు అందించాలని కోరారు.
గ్రామస్థులంతా ఐకమత్యంతో సంప్రదాయబద్ధంగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. పార్డి బి గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పండుగలను సంప్రదాయాలకు అనుగుణంగా, శాంతియుత వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం, పార్డి బి గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు, యువత, తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
