బియ్యం పండించే తెలంగాణలోనే ధరల భారం.. సామాన్యులకు అందని సన్నబియ్యం!
బియ్యం బస్తాపై రూ.వెయ్యి పెరుగుదల.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలి: విజయశాంతి
మన భారత్ హైదరాబాద్: బియ్యం పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నప్పటికీ, అదే రాష్ట్రంలో సామాన్య ప్రజలు బియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొనడంపై తెలంగాణ కాంగ్రెస్ క్యాంపెయిన్ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా నియంత్రణ చర్యలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ప్రశ్నించారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ దందా కారణంగానే ధరలు పెరుగుతున్నాయా? అనే అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఒకప్పుడు రూ.1,500కు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం రూ.2,500కు చేరడం సామాన్య కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని పేర్కొన్నారు. కిలో సన్నబియ్యం ధర రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతున్నప్పటికీ ధరల నియంత్రణలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు బియ్యం ధరలు మరింత భారంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న పాత సన్నబియ్యం గత ఏడాది వానాకాలం, అంతకుముందు పంట సీజన్లలో ఉత్పత్తి అయినవేనని సమాచారం ఉందని విజయశాంతి పేర్కొన్నారు. ఆయా సీజన్లలో ప్రజల అవసరాలకు మించి ధాన్యం ఉత్పత్తి అయిన నేపథ్యంలో పాత బియ్యం నిల్వలకు కొరత ఉండకూడదని వివరించారు. ఎల్నినో ప్రభావం ఉంటే దాని ప్రభావం ప్రధానంగా యాసంగి పంటపై ఉండే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయాలను ప్రస్తావించారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు బియ్యాన్ని నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ మార్కెట్లో ధరలు తగ్గకపోవడానికి కారణాలేమిటో ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. వ్యాపారులు నిల్వల పేరుతో మాయ చేస్తున్నారా? అక్రమ రవాణా ద్వారా సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నారా? లేక ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే కోణాల్లో విచారణ జరపాలని కోరారు. అక్రమ నిల్వలపై తనిఖీలు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
రేషన్ బియ్యం పంపిణీలోనూ పారదర్శకత అవసరం
మరోవైపు పేదలకు ఉచితంగా అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలోనూ పారదర్శకత పెంచాలని విజయశాంతి సూచించారు. మరణించిన వ్యక్తుల పేర్లతో కార్డులు కొనసాగడం, నకిలీ రేషన్ కార్డులు, అనర్హుల నమోదు, బియ్యం అక్రమ మళ్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర పరిశీలన అవసరమన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లులకు చేరినప్పటి నుంచి గోదాములు, రేషన్ దుకాణాల వరకు ప్రతి దశలోనూ లెక్కలు స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఏడాదికి 28.56 లక్షల టన్నుల బియ్యం అవసరమని, అక్టోబర్ 16 నాటికి 9.64 లక్షల టన్నుల నిల్వలు ఉండగా, మరో 18.39 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉందని అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. ఈ గణాంకాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి నిల్వలు, సరఫరా, పంపిణీ వివరాల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మిల్లర్లు, వ్యాపారులు, అధికారులు ఎవరైనా బియ్యం నిల్వలు, కొనుగోళ్లు, రవాణా, పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పౌరసరఫరాల వ్యవస్థలో క్షేత్రస్థాయిలో జరిగే తప్పిదాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణమే సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
