వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు
నీటి పొదుపుపై అధికారుల సూచనలు ఒకవైపు..
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
లీకేజీలతో వృథా మరోవైపు.. పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 5,
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు లీకేజీల కారణంగా వృథాగా పోతోంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు ఇలా వృథా అవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యానగర్ ప్రాంతంలో పైపులైన్‌కు ఏర్పడిన రంధ్రాల (హోల్స్) నుంచి నీరు నిరంతరం బయటకు వస్తూ రోడ్లపైకి చేరుతోంది. ఈ సమస్యపై సంబంధిత అధికారులను చరవాణిలో వివరణ కోరగా వారు స్పందించలేదు.
అయితే, ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందన రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచిస్తుండగా, మరోవైపు పట్టణంలోని విద్యానగర్‌లో తాగునీరు ఇలా వృథాగా పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
తాగునీటి విలువను ప్రజలకు వివరిస్తూ నీటి పొదుపుపై అవగాహన కల్పించాల్సిన సమయంలో, పైపులైన్ లీకేజీలను సకాలంలో అరికట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంబంధిత మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లా కలెక్టర్ స్పందించి, విద్యానగర్‌లో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీటిని అరికట్టేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
