ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన యువ సైనికుడు దుర్మరణం.. సీతాగొంది సమీపంలో కంటైనర్ ఢీకొని ప్రమాదం
మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 4,
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు స్వగ్రామానికి వచ్చిన ఓ యువ బీఎస్ఎఫ్ జవాన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విధి నిర్వహణలో దేశానికి సేవలందిస్తున్న యువ సైనికుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన సాయిప్రసాద్ (27) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో జవాన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రిపుర రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఆయన దీపావళి పండుగ సందర్భంగా సెలవుపై స్వగ్రామానికి వచ్చారు.
ఈ క్రమంలో బుధవారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో సీతాగొంది సమీపానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన కంటైనర్ వారి బైక్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి కిందపడిన సాయిప్రసాద్‌పై నుంచి కంటైనర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
పండుగ వేళ ఇంటికి వచ్చిన కుమారుడు తిరిగి విధుల్లో చేరకముందే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిప్రసాద్ మృతితో జామిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న యువ జవాన్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం స్థానికులను కలచివేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
