manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 2:31 pm Editor : user5442714

రైతుల ఐక్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక: మాజీ మంత్రి

రైతు గర్జన విజయవంతం.. కేటీఆర్‌ను కలిసిన జోగు రామన్న




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ నాయకులు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు జోగు రామన్న, భార్గవ్ దేశ్‌పాండే, యువ నాయకుడు జోగు మహేందర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రైతు గర్జన కార్యక్రమానికి రైతులు, ప్రజల నుంచి లభించిన స్పందనను ఆయనకు వివరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సౌకర్యాల ద్వారా వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని తెలిపారు. రైతుల ఆర్థిక భద్రత, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుబంధు, రైతుబీమా పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సాహం అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జోగు రామన్న విమర్శించారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ హామీలు, వాటి అమలుపై ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే రైతు గర్జన నిర్వహించినట్లు వివరించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రైతు గర్జనకు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా తమ గళాన్ని వినిపించారని, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలకు రైతాంగం తరఫున స్పష్టమైన సందేశం వెళ్లిందని అన్నారు.

రానున్న రోజుల్లోనూ రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటాలను కొనసాగిస్తుందని జోగు రామన్న తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వం తిరిగి రావాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారని, రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ భేటీలో రైతు గర్జన విజయవంతానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, రైతులకు జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});