నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి – అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, గుడిహత్నూర్:నవంబర్ 3,
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, పౌష్టికాహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన గుడిహత్నూర్‌లోని మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన సాగించాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు.
అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ నేలపై కూర్చుని భోజనం చేశారు. పాఠశాలలో అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. భోజనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌ను కూడా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ పండిస్తున్న తాజా కూరగాయలను మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్న తీరును తెలుసుకుని అభినందించారు. పాఠశాలల్లో ఇలాంటి కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు తాజా కూరగాయలతో కూడిన ఆహారం అందించవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించిన కలెక్టర్ వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా, మ్యూజిక్ గదులను ప్రారంభించారు. విద్యతో పాటు శారీరక, మానసిక వికాసానికి యోగా, సంగీతం దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, అవసరమైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, తహసీల్దార్ కవితా రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసు, సర్పంచ్ ఆడే శిల తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
