manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 3:09 pm Editor : user5442714

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ రూ.4 లక్షల మోసం.. నలుగురిపై కేసు

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ రూ.4 లక్షల మోసం.. నలుగురిపై కేసు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

16 మందికి పైగా బాధితులు.. ఒకరి అరెస్ట్, ముగ్గురు పరారీలో

ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు బదిలీ చేయించుకుని ఉడాయింపు

మన భారత్, మావల, నవంబర్ 03: తక్కువ సమయంలో పెట్టిన డబ్బులకు రెట్టింపు నగదు ఇస్తామంటూ ప్రజలను నమ్మించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల వ్యవహారం ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా ఒకే తరహాలో 16 మందికి పైగా బాధితులను మోసం చేసి సుమారు రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

రూ.30 వేలిస్తే రూ.లక్ష ఇస్తామంటూ నమ్మబలికి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన గణేష్ అనే వ్యక్తి గతంలో కామారెడ్డి జిల్లా పరిధిలో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించే విజయ్, రేఖ, బాలాజీల వద్ద రూ.15 వేల నగదు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి వాయిదాల రూపంలో చెల్లిస్తున్న క్రమంలో బాధితుడికి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఆశ చూపించారు.

మూడు నెలల తర్వాత పెట్టిన డబ్బులకు రెట్టింపు నగదు తిరిగి ఇస్తామని నమ్మించారు. ఈ క్రమంలో జనవరి 28న లక్ష్మి, విజయ్, రేఖ, బాలాజీ అనే నలుగురు భగత్‌సింగ్ నగర్‌కు వచ్చి బాధితుడి నుంచి రూ.30 వేల నగదు తీసుకున్నారు. అనంతరం మరో రూ.30 వేలు చెల్లిస్తే అదే రోజు రూ.లక్ష తిరిగి ఇస్తామని ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన గణేష్ ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా మరో రూ.30 వేల నగదును బదిలీ చేశాడు.

భోజనం పేరుతో వెళ్లి కారులో పరారీ

నగదు బదిలీ అయిన తర్వాత భోజనం చేసి వస్తామని చెప్పిన నిందితులు అంబేద్కర్ చౌక్‌లోని బావర్చి హోటల్‌కు వెళ్లారు. భోజనం అనంతరం అక్కడి నుంచి ఇన్నోవా కారులో పరారయ్యారు. ఈ క్రమంలో నిందితులకు చెందిన వివో మొబైల్ ఫోన్ హోటల్ వద్దే మరిచిపోయి వెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ మొబైల్ ఫోన్‌లో నిందితులకు సంబంధించిన ఫొటోలు ఉన్నట్లు తెలిపాడు.

16 మందికి పైగా బాధితులు.. రూ.4 లక్షల వరకు మోసం

ఇదే తరహాలో మరో 16 మందికి పైగా వ్యక్తులను నమ్మించి సుమారు రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. నగదు తిరిగి ఇవ్వాలని బాధితులు ప్రశ్నించగా నిందితులు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనపై మావల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 57/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) రెడ్‌విత్ 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుల వివరాలు

1. లక్ష్మి – పరారీలో ఉంది.
2. విజయ్ అలియాస్ దాసరి రాజు (31), తండ్రి గంగారం, చైతన్య కాలనీ, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా – అరెస్ట్.
3. రేఖ – పరారీలో ఉంది.
4. బాలాజీ – కామారెడ్డి జిల్లా – పరారీలో ఉన్నాడు.

ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మావల ఎస్‌హెచ్‌ఓ

ఈ సందర్భంగా మావల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని, పెట్టిన డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి నగదు బదిలీ చేయవద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక మోసాలు ఉండే అవకాశం ఉందని, ముందుగా వ్యక్తుల వివరాలు, వారి వ్యాపార కార్యకలాపాల విశ్వసనీయతను పరిశీలించాలని తెలిపారు.

ఇప్పటికే ఇలాంటి మోసాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే భయపడకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని, ఫిర్యాదుల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైబర్ లేదా ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});