manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 3:05 pm Editor : user5442714

విదేశాల్లో ఉద్యోగం పేరుతో రూ.2 లక్షల మోసం.. నిందితుడి అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగం పేరుతో రూ.2 లక్షల మోసం.. నిందితుడి అరెస్ట్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగపూర్ ఉద్యోగం పేరుతో నకిలీ ఆఫర్ లెటర్ పంపించి మోసం – ఇచ్చోడ పోలీసుల చర్య**

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 03: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. సింగపూర్‌లో ఉద్యోగం కల్పిస్తానంటూ నకిలీ ఆఫర్ లెటర్, ఆఫర్ కార్డు పంపించి డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ వి. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఫోన్‌పే ద్వారా విడతల వారీగా రూ.2 లక్షలు చెల్లింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన పిలవన్ శ్యామ్ అనే యువకుడు 2024లో హైదరాబాద్‌లో ఎయిర్ హోస్టెస్ కోచింగ్ కోసం వెళ్లిన సమయంలో అమీర్‌పేటలో ఉన్న హ్యాష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ గురించి తెలుసుకున్నాడు. అక్కడ పనిచేస్తున్న గోచిపాతుల అనిల్ కుమార్ అనే వ్యక్తి శ్యామ్‌కు పరిచయమయ్యాడు.

విదేశాల్లో ఉద్యోగం కల్పించడంతోపాటు ఉద్యోగ వీసా ఇప్పిస్తానని, ఇందుకోసం రూ.2 లక్షలు చెల్లించాలని అనిల్ కుమార్ నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మిన బాధితుడు 2026 ఏప్రిల్ 18 నుంచి జూన్ 11 వరకు విడతల వారీగా ఫోన్‌పే ద్వారా మొత్తం రూ.2 లక్షలు చెల్లించాడు.

నకిలీ సింగపూర్ ఆఫర్ లెటర్‌తో బురిడీ

డబ్బులు అందుకున్న అనంతరం నిందితుడు బాధితుడికి వాట్సాప్ ద్వారా సింగపూర్ ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్‌తోపాటు అక్కడికి వెళ్లేందుకు సంబంధించిన ఆఫర్ కార్డును పంపించాడు. అయితే ఆ పత్రాలపై అనుమానం కలిగిన శ్యామ్ సింగపూర్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాలను పరిశీలించగా, ఎలాంటి సమాచారం లభించలేదు.

దీంతో నిందితుడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతోపాటు ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించలేదు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

క్రైమ్ నంబర్ 465/2026తో కేసు నమోదు

బాధితుడి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 465/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4) ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు గోచిపాతుల అనిల్ కుమార్ (28), తండ్రి శ్రీను, ప్రకాశం జిల్లా పండలపాడు మండలం కందుకూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.

విదేశీ ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించే ముందు అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ వి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చే కన్సల్టెన్సీలు, వ్యక్తుల విషయంలో నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంస్థల విశ్వసనీయత, ఉద్యోగ ఆఫర్ లెటర్లు, వీసా పత్రాల నిజానిజాలను సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాలని తెలిపారు. తొందరపడి ముందస్తు చెల్లింపులు చేసి మోసపోవద్దని, అనుమానాస్పద వ్యవహారాలు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});