manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 2:39 pm Editor : user5442714

ఆదివాసీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పోలీసు మీకోసం..

ఆదివాసీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పోలీసు మీకోసం కార్యక్రమం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చెరువుగూడలో ఆరు గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం.. 300 మందికి వైద్య పరీక్షలు
ఆరోగ్యం, విద్య, మహిళల భద్రత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, ఉట్నూర్, నవంబర్ 03:

ఆదివాసీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించి గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చెరువుగూడ గ్రామంలో పోలీసు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు గ్రామాలకు చెందిన ప్రజల కోసం ఆరు విభాగాల వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది గ్రామస్థులు, విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలు పొందారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మూఢనమ్మకాలకు, బాబాల మాయమాటలకు లోనుకాకుండా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో నిపుణులైన వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి సాగు, మత్తు పదార్థాల వినియోగం చట్టపరమైన సమస్యలకు దారితీయడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సంఘ విద్రోహ శక్తులకు సహకరించకుండా గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.

విద్యతోనే ఉన్నత భవిష్యత్తు

చదువు ఒక్కటే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని ఎస్పీ పేర్కొన్నారు. బాలబాలికలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించడం ద్వారా తమ కుటుంబంతో పాటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువత అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

మహిళలు, బాలికల భద్రతకు పోలీసుల అండ

మహిళలు, విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసు అక్క లేదా డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. బాల్యవివాహాలను ప్రోత్సహించవద్దని, బాల్యవివాహాల సమాచారం తెలిసిన విద్యార్థినులు, గ్రామస్థులు పోలీసులకు నిర్భయంగా తెలియజేయాలని కోరారు.

రోడ్డు భద్రతపై అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు కూడా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ఆరు విభాగాల వైద్యులతో ఉచిత సేవలు

వైద్య శిబిరంలో ఆరు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సేవలు అందించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆదిలాబాద్‌లో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడంతో పాటు, చికిత్స అనంతరం తమ వాహనాల్లోనే తిరిగి గ్రామానికి చేర్చే ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసు శాఖ ప్రజలకు చేరువగా ఉంటూ సామాజిక బాధ్యతతో చేపడుతున్న కార్యక్రమాలపై గ్రామస్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఎస్ఐ జి. విజయ్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్ సందీప్ ఐత్వార్, డాక్టర్ టి. వెంకటేష్, డాక్టర్ ఇందూజ, డాక్టర్ శ్వేత, డాక్టర్ సౌమ్య, డాక్టర్ సాగ్నిక్, గ్రామ సర్పంచ్ భగవంతరావు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});