కజ్జర్ల పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ.. ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా వాలంటీర్ల నియామకానికి చర్యలు
మన భారత్, తలమడుగు: నవంబర్ 3, మండలంలోని కజ్జర్ల గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ వై. నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాలు, చదువులో ప్రగతిని స్వయంగా తెలుసుకున్నారు.
ముందుగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన సర్పంచ్.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన భోజనం వండి వడ్డిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల చదువు, విషయ పరిజ్ఞానం, అభ్యసన నైపుణ్యాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు.
అయితే పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని తనిఖీలో గుర్తించారు. ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ఇతర పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపడంతో ప్రస్తుతం కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే మొత్తం విద్యార్థులకు బోధన అందించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అత్యంత ముఖ్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కొరత సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ ఉపశమనంగా విద్యా వాలంటీర్లను నియమించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే తగినంత మంది ఉపాధ్యాయులు ఉండటంతో పాటు విద్యార్థులకు నిరంతర పర్యవేక్షణ, నాణ్యమైన బోధన అందాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, టీచర్ కాల్వల శంకర్, మధ్యాహ్నా భోజన సిబ్బంది ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
