చలానాలు విధించడం ప్రజల్లో మార్పు తీసుకురావడానికే ఉండాలి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రోడ్డు ప్రమాదాల నివారణే ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యం.. వాహనదారులతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 02: రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, వాహనదారుల్లో బాధ్యతాయుతమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. చలానాలు విధించడం కేవలం జరిమానాలకే పరిమితం కాకుండా, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించేలా అవగాహన కల్పించేందుకు ఉపయోగపడాలని స్పష్టం చేశారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాల స్థితిగతులను పరిశీలించారు. దీర్ఘకాలంగా స్టేషన్లో నిల్వ ఉన్న వాహనాలకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, వాటిని సంబంధిత బాధితులకు తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణ పట్టికలను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిసరాల్లో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ట్రాఫిక్ పాయింట్లు, సిగ్నళ్ల వద్ద నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పరిస్థితులకు అనుగుణంగా తక్కువ మొత్తంలో చలానాలు విధిస్తూ, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, నిర్ణీత వేగ పరిమితిని పాటించడం, రహదారి భద్రతా నియమాలను అనుసరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జాతీయ రహదారులపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగం వంటి ఉల్లంఘనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.
వాహనదారులు ఆన్లైన్లో వాహన సంబంధిత పత్రాలను చూపించినప్పుడు వాటిని సక్రమంగా పరిశీలించి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పేదలు, సామాన్య ప్రజలతో పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అదే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా లేదా గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విధుల్లో భాగంగా ఎక్కువ సమయం రహదారులపై గడిపే ట్రాఫిక్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలీస్ శాఖ అందించిన కంటి అద్దాలు, మాస్కులను విధుల సమయంలో తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల వెనుక చిన్నపాటి నిర్లక్ష్యం కూడా విలువైన ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుతూ, ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ఈ తనిఖీల్లో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రావుల దేవేందర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
