manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 2:47 pm Editor : user5442714

అంబేద్కర్ యువజన సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు..

50 ఏళ్లుగా హక్కుల సాధనకు నిరంతర పోరాటం.. అంబేద్కర్ ఆశయాలే లక్ష్యం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల అధ్యక్షుడు జన్నె యుగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘం నాయకులు, అంబేద్కర్ వాదులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఐదు దశాబ్దాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం సంఘం కొనసాగిస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు జన్నె యుగేందర్ 50వ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పుల్ల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. 1976లో అణగారిన వర్గాల ఆత్మగౌరవ పరిరక్షణ, యువతలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాల ప్రచారం లక్ష్యంగా అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటైందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఐదు దశాబ్దాల పాటు సంఘం తన ప్రస్థానాన్ని కొనసాగించడం చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.

దళితుల విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల సాధనతో పాటు రిజర్వేషన్ల పరిరక్షణ, భారత రాజ్యాంగ విలువల కాపాడటానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా దళితులు, మహిళలపై జరుగుతున్న వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం వంటి అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే సంఘం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ నెల 14న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 50వ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పుల్ల మల్లయ్య వెల్లడించారు. ఈ వేడుకలకు దళిత, బహుజన నాయకులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, అంబేద్కర్ వాదులు, మహిళలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘ శ్రేయోభిలాషులు హాజరుకావాలని కోరారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ అరకొండ రాజయ్య, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్, మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు మంగళపెల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల భద్రయ్య, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్, వార్డు సభ్యులు పుల్ల నిర్మల, సతీష్ కుమార్, శనిగరపు మొగిలి, మైదానం కావ్య, శ్రీకాంత్, అంబేద్కర్ వాదులు గురుకుంట్ల కిరణ్, మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు, గుర్రపు రాజమౌళి, గడ్డం సదానందం, పార్లపల్లి కుమార్, కొర్రి సాంబశివుడు, గుర్రపు శంకర్, అరకొండ రాకేష్, కట్కూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});