అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మన భారత్, హైదరాబాద్:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా పటిష్టమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల తరలింపు, గ్రీన్ వాటర్ వినియోగం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాకుండా నిరంతర పర్యవేక్షణతో కూడిన వ్యవస్థగా ఉండాలని సూచించారు.
ఇంటింటికీ చెత్త సేకరణ తప్పనిసరి
నగరంలోని ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాలు నిర్ణీత సమయానికి కాలనీలు, బస్తీలకు చేరుకునేలా చూడాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లు, ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మాణ రంగం నుంచి వెలువడే వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణకు ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
తాగునీటికి బదులుగా గ్రీన్ వాటర్ వినియోగం
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ వంటి అవసరాలకు తాగునీటిని వినియోగించడం తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని ఈ అవసరాలకు ఉపయోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకునేలా ప్రజలకు, నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జలమండలి తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధుల్లోనూ గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని సూచించారు. పార్కులు, పచ్చదనం నిర్వహణ, నిర్మాణ పనులకు శుద్ధి చేసిన నీటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.
సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.
సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా, నిరంతరాయంగా రాకపోకలు సాగించే విధంగా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం రహదారుల పరిస్థితి, వాహనాల రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు హెచ్ఎండీఏ, వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, తాగునీటి పొదుపు, మెరుగైన రవాణా వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూ హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
