manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 1:43 am Editor : user5442714

రిమ్స్‌లో ఎలుకలను కూడా పట్టుకోలేని నల్లమల పులి ఎవరు? సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శలు

రిమ్స్‌లో ఎలుకలను కూడా పట్టుకోలేని నల్లమల పులి ఎవరు? సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 1 రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న ఏసీ పేలుడు ఘటనలో పసిబిడ్డలు మృతి చెందడం తీవ్రంగా బాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జరిగిన విషాద ఘటనకు ఎలుకలే కారణమని చెప్పడంపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

ఆదిలాబాద్ రైతు గర్జన సభ సందర్భంగా ఈ ఘటనను ప్రస్తావించిన కేటీఆర్.. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస భద్రతా చర్యలు లేకపోవడం, పసిబిడ్డల ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. చిన్నారుల మృతికి ఎలుకలే కారణమని చెప్పడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

తనను తాను నల్లమల పులిగా అభివర్ణించుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిమ్స్‌లో ఎలుకలను కూడా పట్టుకోలేకపోయారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆసుపత్రిలో జరిగిన ఘటనకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పసిబిడ్డల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

తమ పార్టీ నాయకులు ఇప్పటికే రిమ్స్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించి వారి పరిస్థితిని తెలుసుకున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, ముఖ్యంగా చిన్నారులకు మెరుగైన వైద్య సదుపాయాలు, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});