manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 7:21 am Editor : Editor Vishal Kumar

నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి..

మంచినీటి వినియోగాన్ని తగ్గించి శుద్ధి చేసిన మురుగునీటిని విస్తృతంగా వినియోగించాలి

HMWSSB 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్, మన భారత్:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు, మురుగునీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) సేవలు అభినందనీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. బోర్డు 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

గత 37 సంవత్సరాలుగా హైదరాబాద్ నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో, మురుగునీటి నిర్వహణ సేవలను సమర్థవంతంగా కల్పించడంలో వాటర్ బోర్డు విశేష కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర ప్రగతిలో బోర్డు అందించిన సేవలు ఎంతో కీలకమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. భవిష్యత్తులో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, అందుబాటులో ఉన్న జల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

మంచినీటిని కేవలం తాగడానికి, వంట చేసుకోవడానికి, ఇతర అత్యవసర గృహావసరాలకే ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని, తోటల పెంపకం, నిర్మాణ పనులు, పారిశ్రామిక అవసరాల కోసం మంచినీటి వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను అందుబాటులోకి తీసుకురావడం అవసరమని తెలిపారు.

ఈ నేపథ్యంలో HMWSSB ప్రారంభించిన ‘డయల్ గ్రీన్ ట్యాంకర్ – గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. సుస్థిర నీటి నిర్వహణ దిశగా ఈ కార్యక్రమం సరైన సమయంలో ప్రారంభించిన ముఖ్యమైన చర్యగా అభివర్ణించారు. నీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మంచినీటిని పొదుపుగా వినియోగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, వాణిజ్య సంస్థలు తమ అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటిని (Treated Wastewater) విస్తృతంగా వినియోగించాలని సీఎం కోరారు. ముఖ్యంగా పార్కులు, తోటల నిర్వహణ, భవన నిర్మాణ పనులు, పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించడం ద్వారా మంచినీటిపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. తద్వారా ప్రజల రోజువారీ అవసరాలకు తగినంత మంచినీరు అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుందని తెలిపారు.

నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటిని వృథా చేయకుండా వినియోగించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను ప్రోత్సహించడం వంటి చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సుస్థిరమైన నీటి నిర్వహణతో భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించే హైదరాబాద్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని ప్రజలకు మరింత మెరుగైన నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సేవలు అందించే లక్ష్యంతో HMWSSB తన ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});