manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 1:19 pm Editor : user5442714

కొర్టా–చనాకా ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణ చేపట్టాలి

నాసిరకం నిర్మాణ పనులతో దెబ్బతింటున్న కాలువలు.. ప్రజాధనానికి భారీ నష్టం
బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి నష్టపరిహారం వసూలు చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 31, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న కొర్టా–చనాకా ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాలువలు దెబ్బతింటూ కూలిపోతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపి, ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం కొర్టా–చనాకా ప్రాజెక్టును సందర్శించి, నిర్మాణ పనులు, కాలువల ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న కాలువలను పరిశీలించిన ఆయన, నిర్మాణంలో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించినప్పటికీ పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళనకరమని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, అంచనాలు, నిధుల విడుదల, నిర్మాణ పనుల అమలు, పర్యవేక్షణ తదితర అంశాలపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. ప్రాజెక్టు పనుల కేటాయింపు, అమలు, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్రను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని అధికారికంగా అంచనా వేసి, అందుకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులు, ఇతర వ్యక్తుల నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేయాలని స్పష్టం చేశారు. కేవలం విచారణతో సరిపెట్టకుండా, అక్రమాలు లేదా నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో చేపట్టిన కొర్టా–చనాకా ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అయితే కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో పాటు, ఇప్పటికే నిర్మించిన పనులు కూడా దెబ్బతింటుండటంతో రైతులకు ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనం అందడం లేదని పేర్కొన్నారు.

రైతుల సాగునీటి అవసరాలు, ప్రజాధన పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని పాయల్ శంకర్ కోరారు. ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశించి, నిర్మాణ పనుల్లో జరిగిన లోపాలు, ఆర్థిక నష్టంపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});