ఫిట్స్‌తో రోడ్డుపై కుప్పకూలిన మహిళకు తక్షణ ప్రథమ చికిత్స.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 31 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర :ప్రజల రక్షణే కాదు.. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా తమ బాధ్యతేనని ఎల్లారెడ్డిపేట పోలీసులు మరోసారి చాటుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు మానవత్వంతో స్పందించి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయిన ఓ మహిళకు సకాలంలో సహాయం అందించారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై శనివారం ఉదయం ఓ మహిళకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయింది. అదే సమయంలో అటుగా విధి నిర్వహణలో వెళ్తున్న బ్లూకోట్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారి ఈ ఘటనను గమనించారు.
వెంటనే స్పందించిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహిళ వద్దకు చేరుకుని ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. ఆమె చేతులు, కాళ్లు రుద్దుతూ సపర్యలు చేయడంతో కొద్దిసేపటికి మహిళ స్పృహలోకి వచ్చింది. ఆపద సమయంలో సకాలంలో స్పందించి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారిలను మండల ప్రజలు అభినందిస్తున్నారు.
పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షకులే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచే ఆపన్నహస్తాలని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
