manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 1:34 pm Editor : user5442714

కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన పలువురు కీలక నాయకులు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన పలువురు కీలక నాయకులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మాజీ వైస్ ఎంపీపీ బెన్వర్ గంగారెడ్డితో పాటు ముక్తాపూర్ బీజేపీ నాయకులు చేరిక

జోగు రామన్న సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న నేతలు.. రైతు గర్జనకు సంపూర్ణ మద్దతు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 31, ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ బెన్వర్ గంగారెడ్డితో పాటు ముక్తాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ముత్యాల కిష్టన్న, సురేష్ శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు జోగు రామన్న నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన సమక్షంలో పార్టీలో చేరగా, జోగు రామన్న వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రైతాంగం పంటల సాగు, దిగుబడులు, ఆర్థిక ఇబ్బందులతో నష్టాలను చవిచూస్తోందని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోందని, రైతుల పక్షాన నిర్వహిస్తున్న రైతు గర్జన కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ తగ్గుతోందని అన్నారు.

ఆదిలాబాద్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని చెబుతున్నప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు చెందినవారిగా ఉన్నా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని విమర్శించారు. జిల్లాకు సంబంధించిన కీలక అభివృద్ధి అంశాలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ముఖ్యంగా గాడ్‌చంద్ నుంచి ఆదిలాబాద్, జైనథ్, బేల మీదుగా రావాల్సిన రైల్వే లైన్‌ను ముక్కుడుబంద్ మీదుగా అనుసంధానం చేసే ప్రతిపాదనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే మార్గంలో మార్పుల వల్ల ఆదిలాబాద్ ప్రాంత ప్రజలకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే లైన్‌ను ఆదిలాబాద్, జైనథ్, బేల మీదుగా తీసుకువచ్చేలా ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఇతర పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్‌లో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్ విజ్జగిరి, సాజితోద్దీన్, నారాయణ, గౌస్, ఆప్కామ్ గంగయ్య, అడపా తిరుపతి, కో రెడ్డి ప్రవీణ్, లక్ష్మణ్, సురేందర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});