manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 1:24 pm Editor : user5442714

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
ఘనంగా.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నివాళులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో జాతీయ ఐక్యత దినోత్సవం

భారతదేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రత పరిరక్షణకు పోలీసుల ప్రతిజ్ఞ

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 30, భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకీకృతం చేసి భారతదేశాన్ని సమైక్య దేశంగా తీర్చిదిద్దడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. అందుకే ఆయనను భారత ఉక్కుమనిషిగా దేశ ప్రజలు గౌరవిస్తున్నారని తెలిపారు.

స్వాతంత్ర్య సమరయోధుడిగా, స్వతంత్ర భారతదేశ తొలి హోంమంత్రిగా పటేల్ అందించిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. దేశంలోని అనేక క్లిష్టమైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ జాతీయ సమైక్యతకు బలమైన పునాదులు వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలు, దేశ సమగ్రత పట్ల చూపిన నిబద్ధతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీసు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది, రిజర్వ్ పోలీసు సిబ్బంది దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

భారతదేశ ఐక్యతను బలోపేతం చేయడం, దేశ అంతర్గత భద్రతను నిరంతరం పరిరక్షించడం, సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గంలో దేశ సమైక్యత కోసం కృషి చేయడం తమ బాధ్యతగా భావిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో పోలీసు ప్రధాన కార్యాలయం ఏవో శివకుమార్, సూపరింటెండెంట్లు సులోచన, సంజీవ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎన్. చంద్రశేఖర్, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ నైలు, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు గోపికృష్ణ, గబ్బర్ సింగ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});